Viral Infections: వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి... 25 d ago

సాధారణంగా వర్షంలో తడిచినపుడు జలుబు, ఫ్లూ వంటి రోగాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. చేతులు కడుక్కోవడం, ముఖాన్ని తాకకుండా ఉండడం, జబ్బుగా ఉన్నవాళ్ళకి దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. విటమిన్ సి, డి, ఎ, జింక్ ఉన్న సిట్రస్ పండ్లు, బెర్రీలు, కివి మరియు ఆకుకూరలు తీసుకోవడం ఉత్తమం. హెర్బల్ టీ, గోరు వెచ్చని నీళ్లలో తేనె కలుపుకుని తాగడం అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచడానికి, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి తగినంత నిద్ర చాలా అవసరం. పెద్దవాళ్లమైతే రాత్రికి 7-9 గంటలు నిద్రపోతే మంచిది. వయసు మీద పడినవాళ్లకి 7-8 గంటలు సరిపోతుంది. పిల్లలు, టీనేజర్లకి ఇంకా ఎక్కువ నిద్ర అవసరం. నిద్రపోయేటప్పుడు మన శరీరం మెలటోనిన్, ప్రోలాక్టిన్, సైటోకిన్లు వంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.. అవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. నిద్ర లేకపోతే ఈ రసాయనాలు సరిగ్గా తయారవ్వక మన శరీరం బలహీనపడుతుంది.
వానాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు తరుచుగా వస్తుంటాయి.. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, మరియు దోమలు ఎక్కువగా ఉండటం వాళ్ళ అవి డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి, ఆరోగ్యంగా ఉండటానికి ఈ సూచనలను పాటించడం ఎంతో ముఖ్యం. వానాకాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఉపయోగించండి అలాగే 24 గంటల కంటే ఎక్కువ నిల్వ ఉన్న నీళ్లు తీసుకోవద్దు. ఇంటి ఆవరణలో నీళ్లను నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీళ్లు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరుగుతాయి... దీని వాళ్ళ జబ్బుపడే అవకాశం ఎక్కువ ఉంది.
ముఖ్యంగా సబ్బుతో 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవడం లేదా 60% కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ ఉపయోగించడం చాలా అవసరం. తరచుగా తాకే వస్తువులను శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. జబ్బుపడిన వ్యక్తులకు దూరంగా ఉండటం, రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, జబ్బుగా ఉంటే ఇంట్లోనే ఉండటం వంటివి వైరస్ వ్యాప్తిని నివారించడానికి సహాయపడతాయి. దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు టిష్యూ లేదా మోచేతిని ఉపయోగించి కవర్ చేయడం తప్పనిసరి.
ఈ పద్ధతులు పాటించడం ద్వారా చాల వరుకు జబ్బుపడకుండా ఉండొచ్చు. వానాకాలంలో చాలా మందికి ఎలర్జీలు వస్తుంటాయి. అటువంటి వారు యాంటీ అలర్జిక్ మందులు వాడాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
గమనిక: పైన అందించిన ఈ ఆరోగ్య సమాచారం మరియు సూచనలు మీ అవగాహన కొరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.